curtecy : https://www.ntnews.com/telangana-news/ips-mahender-reddy-take-charge-as-telangana-dgp-1-1-547879.html
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు.
నేర రహిత తెలంగాణే లక్ష్యం : మహేందర్‌రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్ శర్మ నుంచి డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన.. అనంతరం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని కొనియాడారు మహేందర్‌రెడ్డి. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నతికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీలో నేను సైతం ప్రాజెక్టు అద్భుత ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు. నగరంలో సీసీ కెమెరాలను భారీగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సమాజ భాగస్వామ్యం అవసరమన్న డీజీపీ.. స్థానికులతో పోలీసులు మమేకం కావాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల సేవల్లో నాణ్యత పెంచుతామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. నగరంలో షీ టీమ్స్‌తో ఆకతాయిల ఆగడాలను అరికట్టామని మహేందర్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భరోసా సెంటర్లు, మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ను విస్తరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో పోలీసు శాఖలో 18,500 పోస్టులు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. టెక్నాలజీని ఉపయోగించి శాంతిభద్రతలను అదుపులో పెడుతామన్నారు. చిన్న చిన్న సైబర్ నేరాలను మొదట్లోనే అరికడితే.. పెద్ద పెద్ద నేరాలు జరగవు అని డీజీపీ చెప్పారు. సైబర్ క్రైమ్స్‌ను అరికట్టేందుకు జిల్లాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చిన్న పిల్లలపై లైంగికదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
అధ్యయనశీలి.. అనుభవశాలి..
డీజీపీగా నియమితులైన ఎం మహేందర్‌రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం. 1962 డిసెంబర్ 3న రైతు కుటుంబంలో జన్మించారు. వరంగల్ ఆర్‌ఈసీ నుంచి బీటెక్ (సివిల్) పూర్తిచేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ చదువుతుండగానే 1986లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. సైబరాబాద్ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, గ్రేహౌండ్స్ ఐజీగా వ్యవహరించారు. 2014 జూన్ 2 నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న మహేందర్‌రెడ్డి.. సిటీ పోలీస్‌ను పీపుల్స్ ఫ్రెండ్లీగా మార్చారన్న పేరుతెచ్చుకున్నారు. కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్, నిజామాబాద్, కర్నూల్ జిల్లాల్లో మహేందర్‌రెడ్డి వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడళ్లను అందుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. యూఎస్, యూకే దేశాల్లో పోలీస్ వ్యవస్థపై అధ్యయనం చేసివచ్చారు. మహేందర్‌రెడ్డి సతీమణి అనిత గృహిణి.